Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీ20 ప్రపంచ కప్: పొట్టి క్రికెట్లో హిట్టర్లు వీరే

Posted by:
Published: Monday, September 17, 2012, 10:39 [IST]

శ్రీలంకలో ఈ నెల 18వ తేదీ నుంచి ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ20 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాలు హోరెత్తనున్నాయి. శ్రీలంక వేదికగా ఐసీసీ టి-20 ప్రపంచకప్‌ పోటీల్లో క్రిటెర్లు తమ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. 12 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్-సిలో ఆతిథ్య శ్రీలంక, జింబాబ్వే మధ్య మంగళవారం జరిగే మ్యాచ్‌తో మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. గ్రూపునకు మూడు జట్ల తరఫున నాలుగు గ్రూపులుగా తలపడుతున్న ఈ ట్వంటీ20 ఫార్మాట్‌లో గట్టివారు ఎవరో ఓసారి చూద్దాం. గ్రూప్ దశను అధిగమించి సూపర్-8కు చేరే జట్లపై కూడా ఓ అంచనాకు వద్దాం..

టీ20 ప్రపంచ కప్: పొట్టి క్రికెట్లో హిట్టర్లు వీరే

గ్రూప్-ఎ: ఇంగ్లండ్, భారత్, ఆఫ్ఘనిస్థాన్

ఈ టోర్నమెంట్‌లో అత్యంత బలమైన జట్లున్న గ్రూప్ ఇదే. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తోపాటు టైటిల్ ఫేవరెట్ భారత్ కూడా ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. క్వాలిఫయర్ ఆఫ్ఘనిస్థాన్ మూడో జట్టు. స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ లేకుండానే ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. టి-20 స్పెషలిస్ట్ ఇయాన్ మోర్గాన్ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఇక భారత్ విషయానికొస్తే, కేన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ ఆడుతున్న తొలి మెగా టోర్నీ ఇదే. కివీస్‌తో మ్యాచ్‌లో పునరాగమనాన్ని ఘనంగా చాటిన యువీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

కీలక ఆటగాళ్లు:

మోర్గాన్ (ఇంగ్లండ్): పీటర్సన్ దూరం కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా మోర్గాన్‌కు ఉంది. పొట్టి ఫార్మాట్‌లో అమోఘమైన రికార్డు ఉన్న ఈ ఎడమచేతి వాటం క్రీడాకారుడు మంచి బంతుల్ని సైతం అలవోకగా బౌండ్రీలైన్ దాటిస్తాడు.

కోహ్లీ (భారత్): ఫార్మాట్ ఏదైనా చెలరేగిపోతున్న విరాట్ కోహ్లీ టీమిండియాకు ప్రధాన బలం.

సూపర్ 8కు ఎవరు: ఈ గ్రూప్‌లో భారత్‌ను ఓడించడం మిగతా రెండు జట్లకు కష్టమే. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ విజేతను బట్టి గ్రూప్‌లో అగ్రస్థానమెవరిదో తేలుతుంది. ప్రస్తుత ఫామ్‌ను చూస్తే భారత్ గ్రూప్‌లో అగ్రస్థానంతో సూపర్ 8కు చేరొచ్చు. ఇంగ్లండ్‌కు రెండో స్థానం దక్కొచ్చు. సంచలనం నమోదైతే తప్ప ఆఫ్ఘనిస్థాన్ ఇంటికే..!

గ్రూప్-బి: ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఐర్లాండ్

ఈ గ్రూప్ నుంచి సూపర్-8కు ఎవరు వెళ్తారన్నది ఊహించడం కొద్దిగా కష్టమైన విషయమే. గేల్‌తో కూడిన విండీస్ పటిష్టంగానే కనిపిస్తుంది. మిగతా ఫార్మాట్లలో ఎలా ఉన్నా టి- 20ల్లో మాత్రం ఆసీస్ ప్రదర్శన చెత్తగా ఉంది. అన్నీ కలిసొస్తే ఐర్లాండ్ కూడా వెళ్లొచ్చు.

కీలక ఆటగాళ్లు:

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా): డాషింగ్ బ్యాట్స్‌మన్ వార్నర్ ఆసీస్‌కు కీలకమైన క్రీడాకారుడు. 130 మ్యాచ్‌ల్లో వార్నర్ సగటు 31.35 అయితే స్ట్రయిక్ రేట్ 143పైనే ఉంది.

క్రిస్ గేల్ (వెస్టిండీస్): ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్. ప్రత్యేకించి టి-20ల్లో గేల్‌ను నిలువరించడం ప్రత్యర్థి జట్లకు కష్టమే. ప్రత్యర్థులను, బంతులను లెక్క చేయకుండా ధనాధన్ విరుచుకుపడే ఆటగాడు క్రిస్ గేల్.

జార్జ్ డాక్రెల్ (ఐర్లాండ్): ఇటీవల ఐర్లాండ్ సాధించిన విజయాల్లో డాక్రెల్ కీలక పాత్ర పోషించాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన డాక్రెల్ పొట్టి ఫార్మాట్‌లో పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. 41మ్యాచ్‌ల్లో డాక్రెల్ 50 వికెట్లు పడగొట్టాడు.

సూపర్-8కు ఎవరు: ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఈ గ్రూప్‌లో విండీస్ టాప్‌గా నిలిచే అవకాశాలున్నాయి. ఇక సంచనాలు సృష్టించగల ఐర్లాండ్ రెండోస్థానం సాధించొచ్చు. స్థాయికి మించి రాణిస్తే తప్ప ఆసీస్ సూపర్-8కు చేరకపోవచ్చు.

గ్రూప్-సి: శ్రీలంక, దక్షిణాఫ్రికా, జింబాబ్వే

శ్రీ లంక, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లు ఉన్న ఈ గ్రూపులో సూపర్-8కు ఏ జట్లు చేరతాయో ఊహించొచ్చు. స్థానిక బలం శ్రీలంక సొంతం కాగా, ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన దక్షిణాఫ్రికా కూడా అగ్రస్థానానికి పోటీ పడుతోంది. ఇక జింబాబ్వే గ్రూప్ దశను దాటాలంటే అద్భుతాలు చేయాలి.

కీలక ఆటగాళ్లు :

మలింగ (శ్రీలంక): యార్కర్ల స్పెషలిస్ట్ మలింగపై అంచనాలు భారీగానే ఉన్నా ఇటీవలి అతని ఫామ్ కలవరపెడుతోంది. గత పది మ్యాచ్‌ల్లో మలింగ పడగొట్టింది 11 వికెట్లే. అయితే ఈసారి సొంత మైదానాల్లో ఆడతుండడం కలిసి వచ్చే అంశం.

డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా): గత కొన్నేళ్లుగా టాప్ బౌలర్‌గా కొనసాగుతున్న స్టెయిన్ సఫారీల తురుపుముక్క. టి-20ల్లో అతని రికార్డు అమోఘం. స్టెయిన్ మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగలడు.

మసకద్జ (జింబాబ్వే): నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్‌మన్ మసకద్జపై జింబాబ్వే భారీగానే ఆశలు పెట్టుకుంది. ప్రత్యేకించి జట్టు కష్టాల్లో ఉన్నపుడు మసకద్జ మె రుగైన ప్రదర్శన చేస్తాడు.

సూపర్-8కు ఎవరు: దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఈ గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచి సూపర్-8 దశకు చేరుకుంటుంది. జింబాబ్వే ఇంటిదారి పట్టే అవకాశాలున్నాయి.

గ్రూప్-డి: పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్

గ్రూప్-బి మాదిరిగానే ఈ గ్రూపులో కూడా సూపర్-8కు ఎ వరు వెళతారో అంచనా వేయడం కష్టం. పాకిస్థాన్ అగ్రస్థానం దక్కించుకునేలా ఉన్నా నిలకడలేమి ఆ జట్టుకు ప్రధాన సమస్య. మెరుగైన ప్రదర్శన చేస్తే న్యూజిలాండ్ కూడా గ్రూప్‌లో టాప్‌గా నిలవొచ్చు. ఇక బంగ్లాదేశ్ రాత ఆ జట్టు ఆటతీరుపైనే ఆధారపడి ఉంది.

కీలక ఆటగాళ్లు:

అజ్మల్ (పాకిస్థాన్): శ్రీలంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి కాబట్టి అజ్మల్ ఇక్కడ కీలక పాత్ర పోషించనున్నాడు.

బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్): మెకల్లమ్ చెలరేగితే ఎంతటి బౌలరైనా బౌండరీలు సమర్పించుకోవాల్సిందే. అయితే మెకల్లమ్ ఏ మేరకు నిలకడ సాధిస్తాడనేది కీలకం.

సూపర్-8కు ఎవరు: ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే పాకిస్థాన్, న్యూజిలాండ్‌లు సూపర్-8కు చేరతాయి. బంగ్లాకు నిరాశ తప్పకపోవచ్చు.

English summary
ICC World Twenty20 2012's Group A has two former champions in India and England. MS Dhoni and his men won the inaugural edition of World T20 in South Africa in 2007 while England, under Paul Collingwood tasted their first ever global success in 2010 in the Caribbean. The third team in Group A is from the qualifiers, Afghanistan.
మీ వ్యాఖ్య రాయండి