కొలంబో: కమ్రాన్ అక్మల్ దూకుడుకు భారత్ తల వంచింది. పాకిస్తాన్‌తో జరిగిన ఐసిసి ట్వంటీ20 వార్మప్ మ్యాచులో భారత్ ఓటమి పాలైంది. తొలుత భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడిన పాకిస్తాన్ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించి తమ ముందు భారత్ ఉంచిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కమ్రాన్ అద్భుతమైన అర్థ సెంచరీకి భారత బౌలర్లు చేతులెత్తేశారు. కమ్రాన్ అక్మల్ 92 పరుగులు చేశాడు. ఐదు బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ విజయాన్ని సొంతం చేసుకుంది.
పాకిస్తాన్ ఓపెనర్లు త్వరగానే అవుటైనప్పటికీ కమ్రాన్ అక్మల్, మొహమ్మద్ హఫీజ్ ఇన్నింగ్సును గాడిలో పెట్టారు. అశ్విన్ దెబ్బకు కుప్పకూలిందని భావించిన పాకిస్తాన్ బ్యాటింగ్ కమ్రాన్ రాకతో పుంజుకుంది. పాకిస్తాన్ ఒక సందర్భంలో 11.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో అశ్విన్‌కు నాలుగు వికెట్లు లభించాయి.
భారత్ తొలుత బ్యాటింగ్ చేసి మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పాకిస్తాన్‌పై వార్మప్ మ్యాచులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూకుడు ప్రదర్శించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ 47 బందతుల్లో 75 పరుగులు చేసి, అన్ని ఫార్మాట్లలోనూ తనది పైచేయి అని నిరూపించుకున్నాడు. ఇటీవల వరుసగా విఫలమైన రోహిత్ శర్మ 40 బంతుల్లో 56 పరుగులు చేసి సత్తా చాటాడు.
గౌతం గంభీర్ (10), వీరేంద్ర సెహ్వాగ్ (26) చాలా త్వరగా అవుటైన తర్వాత కోహ్లీ, రోహిత్ కలిసి 12.5 ఓవర్లకు 127 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో సయీద్ అజ్మల్ 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. టాస్ గెలిచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇది 11వ వార్మప్ మ్యాచ్. ఇది పాకిస్తాన్‌కు తొలి వార్మప్ మ్యాచ్ కాగా, ఇండియాకు రెండోది. ఈ నెల 15వ తేదీన శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచులో భారత్ గెలిచింది. ఇండియా శ్రీలంకపై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ ఈ నెల 19వ తేదీన ఇంగ్లాండుతో తలపడనుంది.
శ్రీలంకపై జరిగిన తొలి వార్మప్ మ్యాచులో భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక వెలుగు వెలిగారు. ఐదు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అర్థ సెంరీతో భారత్‌కు మంచి స్కోరును సాధించిపెట్టాడు. వార్మప్ మ్యాచులో భారత ఓపెనర్ గౌతం గంభీర్ గాయపడడమే భారత్‌కు ఇబ్బందికరంగా మారింది.
తుది జట్లు
పాకిస్తాన్: మొహ్మద్ హఫీజ్ (కెప్టెన్), నసీజర్ జంషేడ్, ఇమ్రాన్ నజీర్, ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిదీ, కమ్రాన్ అక్మల్ (వికెట్ కీపర్), ఉమర్ గుల్, మొహ్మద్ సమీ, సోహెల్ తన్వీర్, సయీద్ అజ్మల్
భారత్: గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, ఇర్ఫాన్ ఫఠాన్, రవిచంద్రన్ అశ్విన్, లక్ష్మీపతి బాలాజీ, జహీర ఖాన్











