కొలంబో : ఓడిపోతున్న తరుణంలోనూ అఫ్గాన్ బ్యాట్స్‌మన్ గుల్బోదీన్ నయిబ్ తెగువ ప్రదర్శించాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 44 పరుగులు చేసి చివరకు డెర్మ్‌బ్యాచ్‌కు దొరికిపోయాడు. దాంతో ఇంగ్లాండుపై అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. అఫ్గాన్ 116 పరుగుల తేడాతో ఇంగ్లాండుపై ఓడిపోయి, ఇంటి దారి పట్టింది. ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ ఏ గ్రూప్‌లో రెండు మ్యాచులు ఆడిన ఆఫ్గాన్ ఆ రెండింటిలోనూ ఓడిపోయింది.
ఇంగ్లాండు బౌలర్ల ముందు అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. గుల్బోదీన్ తప్ప మిగతా వారెవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ వెళ్లారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. అఫ్గాన్లు 17.2 ఓవర్లు ఆడి 80 పరుగులకు ఆలవుట్ అయ్యారు. ఒక సందర్భంలో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 26 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన సందర్భంలో గుల్బోదీన్ దూకుడు ప్రదర్శించి స్కోరును ఆ మాత్రం స్థాయికి తీసుకుని రాగలిగాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లూక్ రైట్ అఫ్గాన్ల బౌలర్లను దంచి కొట్టాడు. 55 బంతుల్లో 99 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. అఫ్గాన్లు క్యాచులు డ్రాప్ చేయడమే పెద్ద సమస్యగా మారింది. ఇండియాతో జరిగిన మ్యాచులోనూ ఇదే జరిగింది. హేల్స్ 31 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. మోర్గాన్ 23 బంతుల్లో 27 పరుగులు చేశాడు.
అఫ్గానిస్తాన్ బౌలర్లలో ఇజాతుల్లా దవ్లాత్జాయ్ రెండు వికెట్లు తీసుకోగా, షాపూర్ జద్రాన్, దవ్లాత్ జద్రాన్ చెరో వికెట్ తీసుకున్నారు. టీ20 డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌ను శుక్రవారంనాడు ఆఫ్గనిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్‌ను ముప్పు తిప్పలు పెట్టిన అఫ్గానిస్తాన్ క్రీడాకారులు ఈ మ్యాచులో చిత్తుగా ఓడిపోయింది.
గ్రూప్-ఎలో భాగంగా బుధవారం నాడు జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌తో పోరు సలిపిన ఆఫ్గన్ అంచనాలకు మించి పోరాటపటిమను కనడరిచింది. అగ్రశ్రేణి జట్టైన భారత్‌కు ముచ్చెమటలు పట్టించి సంచలనం వెైపు అడుగులు వేసిన ఆఫ్గన్‌లు అదే స్పూర్తితో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోలేకపోయారు.
జట్లు
ఇంగ్లాండు: స్టార్ట్ బ్రాడ్ (కెప్టెన్), జోనాథన్ బెయిర్‌స్టో, రవి బొపారా, టిమ్ బ్రెస్నాన్, డానీ బ్రిగ్స్, జోబ్స్ బట్లర్, జడే డెర్న్‌బాచ్, స్టీవెన్ ఫిన్, అలెక్స్ హేల్స్, క్రెయిగ్ కీస్‌వెట్టర్ (వికెట్ కీపర్), మైఖైల్ లుంబ్, ఇయోయిన్ మోర్గాన్, సమిత్ పటేల్, గ్రేమ్ స్వాన్, లూక్ రైట్
అఫ్గానిస్తాన్: నోవ్రాజ్ మంగల్ (కెప్టెన్), దవ్లాత్ జద్రాన్, గుల్బదిన్ నయీబ్, హమీద్ హసన్, ఇజ్జతుల్లా దవ్లత్‌జాయ్, కరీం సాదిక్, మొహ్మద్ జావేద్ అహ్మది, మొహ్మద్ నసీం బరాస్, మొహ్మద్ నబీ, మొహ్మద్ షెహజాద్, మొహ్మద్ అస్ఘర్ స్టానిక్జాయ్, నజిబుల్లా జద్రాన్, షమియుల్లా శివారి, షఫీఖుల్లా షఫాక్, షాపూర్ జద్రాన్











