న్యూఢిల్లీ: ఇంగ్లాండు సిరీస్‌లో భారత జట్టు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారని వసీం అక్రమ్ చెప్పారు. ఇంగ్లాండు సిరీస్‌లో బౌలర్లు విఫలం కావడంతో భారత బౌలింగు భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మూడు టెస్టుల సిరీస్‌లో జహీర్ ఖాన్ విఫలమై చోటు కోల్పోగా.. ఇషాంత్ శర్మ ఫరవాలేదనిపించారని తెలిపాడు.
కానీ ఐదేళ్ల సీనియర్‌గా అతను మరింత స్థిరంగా రాణించాల్సి ఉండెనన్నారు. ఉమేష్ యాదవ్, వరుణ్ అరోణ్‌లు ఎప్పుడూ ఏదో ఒక గాయంతో బాధపడుతున్నారన్నారు. జట్టులో కొత్త ముఖాలకు చోటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కోల్‌కతా బౌలర్ షామి అహ్మద్ లాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారని, 2011 సీజన్లో నైట్ రైడర్స్ జట్టులో ఉన్నప్పుడు అలాంటి నైపుణ్యం గల బౌలర్ గురించి తెలుసుకున్నానన్నారు.
వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనికి 'ది వాల్' రాహుల్ ద్రావిడ్ తర్వాత మద్దతు పెరుగుతోంది. ధోనీకి మద్దతుగా నిలుస్తున్న వారి జాబితాలో మాజీ సారథి కపిల్ దేవ్ కూడా చేరిపోయాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ ఓటమి తర్వాత ధోనీని తప్పించి యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయాలను కపిల్ సమర్థించలేదు.
విరాట్ ప్రతిభావంతమైన క్రికెటర్ అయినప్పటికీ టెస్టు కెప్టెన్సీకి అతని అనుభవం సరిపోదని చెప్పాడు. ఒకవేళ కోహ్లీకి సారథ్యం అప్పగిస్తే సీనియర్లను సమన్వయం చేయడం అతనికి కష్టంగా మారుతుందన్నాడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కెప్టెన్‌గా ధోనీ తప్ప భారత్‌కు మరో చాన్స్ లేదని వ్యాఖ్యానించాడు.











