Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

చెలరేగిన మోర్గాన్: కివీస్‌పై ఇంగ్లాండ్ రికార్డు ఛేజ్

Published: Friday, June 19, 2015, 13:44 [IST]

లండన్: ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్‌ను ఏడు వికెట్ల తేడాతో గెలిపించాడు. మోర్గాన్‌తోపాటు జో రూట్ కూడా సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లాండ్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఛేజింగ్‌లో లక్ష్యాన్ని చేరుకొని, ఇంగ్లాండ్ గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.

జూన్ 12న ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఛేజింగ్‌లో 9 వికెట్లకు 365 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతకు ముందు కివీస్ 5 వికెట్లకు 398 పరుగులు సాధించడంతో, ఇంగ్లాండ్‌కు ఆ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు.

కాగా, తాజా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 349 పరుగలు చేసింది. మార్టిన్ గుప్టిల్ (53), కేన్ విలియమ్‌సన్ (90), ఇలియట్ (55 నాటౌట్) అర్ధ శతకాలు నమోదు చేయగా, రాస్ టేలర్ 42, సాంటర్ 44 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, బెన్ స్టోక్స్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.

England v New Zealand: Root & Morgan lead record run chase

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు జాసన్ రాయ్ (38), అలెక్స్ హాలెల్ (67) మొదటి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఇద్దరూ 11 పరుగుల తేడాతో ఔట్‌ కాగా, జో రూట్, ఇయాన్ మోర్గాన్ జట్టుకు అండగా నిలిచారు. రూట్ నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న మోర్గాన్ చెలరేగిపోయాడు.

97 బంతుల్లోనే, 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 113 పరుగులు చేసిన మోర్గాన్.. సౌథీ బౌలింగ్‌లో హెన్రీ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. కాగా, రూట్ 97 బంతుల్లో, 13 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేసి అజేయంగా నిలవగా, ఇంగ్లాండ్ 44 ఓవర్లలో మూడు వికెట్లకు 350 పరుగులు సాధించి, ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్‌కు ఇంగ్లాండ్ సమవుజ్జీగా నిలిచింది. ఇరు జట్లు చెరి రెండు విజయాలు సాధించడంతో, జూన్ 20న చెస్టర్‌లీలో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది.

English summary
England smashed the record for their highest ever one-day run chase to beat New Zealand by seven wickets at Trent Bridge and level the series at 2-2.
మీ వ్యాఖ్య రాయండి