Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వీడియో చూస్తే, ధోనీ తప్పులేదు: శాస్త్రి, దాల్మియా రివర్స్!

Posted by:
Published: Sunday, June 21, 2015, 11:45 [IST]

మీర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో ముస్తాఫిజర్ రెహ్మాన్‌ను ఢీకొట్టడంలో భారత కెప్టెన్‌ ధోని తప్పేమీ లేదని టీమ్‌ డైరెక్టర్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ధోని చేసింది సరైందేనని, అది అనివార్యంగా జరిగిందన్నాడు. నిజానికి ధోని పెద్ద ప్రమాదాన్ని తప్పించాడని చెప్పాడు.

వీడియో ఫుటేజ్‌ చూస్తే అది అర్థమవుతుందని తెలిపాడు. అతను ముస్తాఫిజర్‌కు తాకకుండా బ్యాట్‌ను పక్కకు తీశాడని, లేదంటే బౌలర్‌ మూణ్నాలుగు నెలలు మైదానానికి దూరవుయ్యేవాడని, ఇలాంటి ఘటనలు ఆటలో మామూలేనని చెప్పాడు.

 Ravi Shastri

ధోనీ పైన విచారణ అనలేదు: దాల్మియా

ధోనీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా స్పష్టం చేశాడు. ఒక ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను ఆ పత్రిక మరో రకంగా ప్రచురించిందని అన్నాడు. పరస్పరం లాభాలున్న హోదాల్లో కొనసాగరాదంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన బీసీసీఐ దాల్మియా, కేపీ ఖజారియా, జ్యోతిరాదిత్య సింధియాతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

భారత క్రికెట్‌లో ఈ విధంగా పరస్పర ప్రయోజనాలు కలిగిన వారి గురించి వివరాలను సేకరిస్తున్నది. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ధోనీకి రితీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న సంస్థతో సంబంధం ఉన్నదన్న వాదనలున్నాయి.

దాని యజమాని అరుణ్ పాండేతో ధోనీకి దగ్గరి సంబంధాలున్నాయి. ఇద్దరూ చిన్ననాటి మిత్రులని, ధోనీకి ఆ కంపెనీలో ఎక్కువ వాటాలున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా వుంటే, సురేష్ రైనా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లకు ఈ కంపెనీనే ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తున్నది.

కాగా, ఒక స్పోర్ట్స్ కంపెనీలో భాగస్వామిగా ఉంటూ, టీమిండియాకు కెప్టెన్‌గా కొనసాగడంపై ధోనీని ప్రశ్నించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు బోర్డు గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తానని మాత్రమే తాను చెప్పానని దాల్మియా తెలిపాడు. అయితే, ధోనీని బోర్డు విచారిస్తుందంటూ ఆ పత్రిక ప్రచురించిందని వివరించాడు.

English summary
India's ODI captain Mahendra Singh Dhoni is facing a lot of criticism in Bangladesh for knocking down young fast bowler Mustafizur Rahman in the first of the three ODIs at the Sher-e-Bangla Stadium on Thursday. But Team Director Ravi Shastri says there's nothing wrong in what Dhoni did as he was left with no choice.
మీ వ్యాఖ్య రాయండి