Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తొందరెందుకు?: ధోనీకి దాదా, సన్నీ మద్దతు

Published: Tuesday, June 23, 2015, 12:21 [IST]

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ చేతిలో రెండు వన్డేల పరాజయం అనంతరం విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నుంచి మద్దతు లభించింది. వన్డే కెప్టెన్‌గా గొప్ప రికార్డులెన్నో సాధించిన ధోనీని గౌరవించాలని, తన భవిష్యత్‌పై స్వేచ్ఛగా ఆలోచించుకునే సమయం అతనికివ్వాలని అన్నాడు.

రెండు వన్డేల ఓటమి అనంతరం.. ధోనీ ఏదో ఆవేశంలో ‘వీలైతే తప్పుకుంటా' అని అన్నాడని చెప్పాడు. ఆ వ్యాఖ్యలను ఓ అభిప్రాయంగా పరిగణించరాదని తెలిపాడు. ‘బంగ్లా చేతిలో సిరీస్ ఓటమి అతణ్ని చికాకుపరిచి ఉంటుంది. ఈ ఓటమిపై అందరూ కూర్చోని మాట్లాడుకోవాలి. దీనికి ధోనీని మాత్రమే బాధ్యుణ్ని చేయడం సరికాదు' అని దాదా అన్నాడు.

2016 టీ20 వరల్డ్‌కప్ దాకా ధోనీ కెప్టెన్‌గా కొనసాగుతాడని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు దాదా స్పందిస్తూ.. ‘ఈ సిరీస్ అయితే ముగిసిపోనివ్వండి. ఇలాంటి నిర్ణయాలు రాత్రికి రాత్రే తీసుకోరు. ఏ నిర్ణయమైనా దీర్ఘకాలిక ప్రయోజనాలను బట్టివుంటుంది' అని బీసీసీఐ సలహా మండలి సభ్యుడు కూడా అయిన గంగూలీ తెలిపాడు.

Let's give MS Dhoni respect and time, says Sourav Ganguly

మరో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా ధోనీకి మద్దతుగా నిలిచాడు. కెప్టెన్‌గా పరిమిత ఓవర్ల ఆట నుంచి కూడా ధోనీ నిష్క్రమించాలనుకుంటే.. అది అతని వ్యక్తిగత నిర్ణయమని, అయితే ఇప్పటికీ జట్టుకు సారథ్యం వహించే సామర్థ్యం ధోనీకి పుష్కలంగా ఉందన్నాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.

‘కెప్టెన్‌గా కొనసాగాలా.. వద్దా? నిర్ణయం ఏదైనా, అతనే తీసుకోవాలి. ఛాంచాంపియన్స్ ట్రోఫీతో పాటు టీ20, వన్డే వరల్డ్‌కప్‌లనూ ధోనీ అందించాడు. టెస్టు ఫార్మాట్‌లో జట్టును నెంబర్‌వన్‌గా నిలిపాడు. కెప్టెన్‌గా ఈ ఘనతలన్ని సాధించినందుకు అతడ్ని మనం గుర్తించాలి, గౌరవించాలి' అని చెప్పాడు.

‘కెప్టెన్‌గా ధోనీని తొలగించాలనే అభిప్రాయం మాత్రం సరికాదు. వన్డే ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఇప్పటికీ అతనే సరైన వ్యక్తి. దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్‌పై సిరీస్ ఓడిపోయాం. అందుకే, మంచి క్రికెట్ ఆడినందుకు ఆ జట్టుకు క్రెడిట్ ఇద్దాం' అని గవాస్కర్ అన్నాడు.

కాగా, ‘ధోనీ రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఇటీవలే అతను వరల్డ్ కప్‌లో టీమిండియాను సెమీస్ వరకూ తీసుకెళ్లాడు. ఆ మెగా టోర్నీ తర్వాత మొదటి సిరీస్ ఇదే. కాబట్టి, ఒక్క వైఫల్యానికే అతనిని తప్పుపట్టడం మంచిదికాదు' అని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ పిటిఐతో మాట్లాడుతూ పేర్కొన్నాడు.

వన్డే, టి-20 ఫార్మెట్లలో భారత జట్టును నడిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తి ధోనీ ఒక్కడేనని మరో మాజీ కెప్టెన్ అజీత్ వాడేకర్ అన్నాడు. కెప్టెన్‌గా అతనిని కొనసాగించాలని హితవు పలికాడు.

బంగ్లాదేశ్ సిరీస్ ఫలితాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నాడు. ప్రత్యర్థిని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురై ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. ఒక్క బంగ్లాదేశ్ టూర్‌నే భూతద్దంలో చూపించి ధోనీ రాజీనామా కోరడం మంచిది కాదని మాజీ క్రికెటర్ చందూ బోర్డే అన్నాడు.

‘వన్డే జట్టు కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది?' అని మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ ప్రశ్నించాడు. ఒకే ఒక సిరీస్‌లోని ఫలితాలను బట్టి హడావుడి నిర్ణయాలకు రావద్దనీ, అనవసరంగా విమర్శలు గుప్పించరాదనీ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. ధోనీ సమర్థుడైన నాయకుడని ప్రశంసించాడు.

English summary
Former captain Sourav Ganguly today demanded respect for beleaguered Mahendra Singh Dhoni, saying he has astonishing One-day records as skipper and needs to be given all the time in the world to take a decision.
మీ వ్యాఖ్య రాయండి