Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బాధేస్తోంది: కుంద్రా, శిల్పాశెట్టిపై దృష్టి, శుక్లా స్పందన

Posted by:
Updated: Thursday, July 16, 2015, 16:36 [IST]

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్కాంలో తనను దోషిగా తేల్చడం పట్ల శిల్ఫాశెట్టి భర్త, రాజస్థాన్‌ రాయల్స్‌ మాజీ సహ యజమాని రాజ్ కుంద్రా విచారం వ్యక్తం చేశాడు. తనకిది దుర్దినమని, తన నిజాయతీనే శంకించారన్నాడు.

బెట్టింగ్‌ కుంభకోణం విచారణకు పూర్తిగా సహకరించడమే తనను దెబ్బ తీసినట్లుందని, సుప్రీం అంటే ఎంతో గౌరవముందన్నాడు. దురదృష్టవశాత్తు ఈ కేసులో తనను తప్పుగా చూపించారన్నాడు. తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పరువును, ఏ ఆధారంతో నాశనం చేశారో తెలియజేయాలని అడుగుతానన్నాడు.

తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం లేకున్నా దోషిగా తేల్చడం బాధేస్తోందన్నాడు. అయినా ఒకరిపై ఆరోపణల కారణంగా జట్టంతటికీ శిక్ష విధించడం సరికాదనిపించిందన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌లో తన వాటా 11.7 శాతం మాత్రమేనని, భారత్‌లో క్రికెట్‌ వ్యవహారాల విషయానికొస్తే తాను ఎప్పుడో తెంచేసుకున్నానన్నాడు. కాగా, శిల్పాశెట్టి పాత్ర పైన కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

IPL scam: Raj Kundra almost got off the hook

చెన్నై, రాజస్థాన్‌లకు శాశ్వత సెలవు?

ఐపీఎల్ ఆరంభ సమయంలో ఫ్రాంచైజీలతో బిసిసిఐ పదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ గడువు ముగిశాక ఒప్పందాల్ని రెన్యూవల్ చేసేందుకు అవకాశముంది. చెన్నై, రాజస్థాన్‌ల పైన రెండేళ్లు సస్పెన్షన్ వేటు పడింది.

కాబట్టి అది పూర్తయ్యే సమయానికే బిసిసిఐతో ఒప్పందమూ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలు శాశ్వతంగా ఐపీఎల్‌కు దూరమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. చెన్నై, రాజస్థాన్ నగరాల స్థానంలో కొత్తగా వేరేవి రావొచ్చు.

మరోవైపు, 2011 ఐపీఎల్‌ సీజన్‌లో అరంగేట్రం చేసి, ఆ ఒక్క ఏడాదితో లీగ్‌ నుంచి నిష్క్రమించిన కోచి టస్కర్స్‌ కేరళ ఫ్రాంఛైజీని తిరిగి ఐపీఎల్‌లోకి తెచ్చే అవకాశాల్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. తమను అన్యాయంగా ఐపీఎల్‌ నుంచి తప్పించారని ఫ్రాంఛైజీ యాజమాన్యం కోర్టుకెక్కగా వారికి రూ.550 కోట్లు పరిహారంగా చెల్లించాలని తీర్పు వచ్చింది.

ప్రస్తుతం రెండు ఫ్రాంఛైజీలపై వేటు పడిన నేపథ్యంలో కోచిని వెనక్కి పిలిస్తే రెండు విధాలా లాభమని బీసీసీఐ భావిస్తోంది. దీని ద్వారా ఒక జట్టును భర్తీ చేయడంతో పాటు కోచికి పరిహారం చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదన్నది బోర్డు ఆలోచనగా తెలుస్తోంది.

బీసీసీఐ కొత్త జట్ల కోసం వేలం నిర్వహిస్తుందో లేదో కానీ కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు అప్పుడే బిడ్దింగ్‌కు సిద్ధమైపోతున్నారు. బీసీసీఐ అవకాశమిస్తే అహ్మదాబాద్‌లో ఫ్రాంఛైజీ నడపాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న అదాని గ్రూప్‌ యజమాని గౌతమ్‌ అదాని తాజా పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ బిడ్డింగ్‌కు ఆహ్వానిస్తే కచ్చితంగా పోటీలో ఉంటానని చెప్పారు.

వీడియోకాన్‌ గ్రూప్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌, గతంలో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ కొనుగోలు కోసం గట్టి ప్రయత్నం చేసిన పీవీపీ గ్రూప్‌ అధినేత ప్రసాద్‌ పొట్లూరి తాజా పరిణామాల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. హర్ష్‌ గోయెంకా (ఆర్‌పీజీ గ్రూప్‌), సజ్జన్‌ జిందాల్‌ (జేఎస్‌డబ్ల్యూ), ముంజల్‌ (హీరో గ్రూప్‌) ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల విషయంలో ఆసక్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

రాజీవ్ శుక్లా స్పందన

ఐపిఎల్ బెట్టింగ్-ఫిక్సింగ్ కుంభకోణానికి బాధ్యత వహించేందుకు రాజీవ్ శుక్లా నిరాకరించారు. లోథా కమిటీ తీర్పును తాము వ్యతిరేకించబోమని, కమిటీకి సహకరిస్తామన్నారు. కమిటీ తీర్పుతో ఐపిఎల్ పైన మచ్చపడినట్లు భావించరాదన్నారు.

దీనిపై బిసిసిఐ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. లోథా కమిటీ నివేదికలో బిసిసిఐ మాజీ అధ్యక్షులు ఎన్ శ్రీనివాసన్ ప్రస్తావనే లేదన్నారు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై నిషేధంతో, ఐపీఎల్ తదుపరి సీజన్లో ఎన్ని జట్లు ఆడనున్నాయన్న ప్రశ్నకు స్పష్టంగా బదులివ్వలేదు.

Story first published:  Thursday, July 16, 2015, 10:01 [IST]
English summary
IPL scam: Raj Kundra almost got off the hook
మీ వ్యాఖ్య రాయండి