Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నా కూతురు క్రికెటర్లా చూడాలి, ఉగ్రవాదిలా కాదు: శ్రీశాంత్

Updated: Sunday, July 26, 2015, 13:50 [IST]

కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొన్న భారత మాజీ పేసర్ శ్రీశాంత్, కోర్టు నిర్ధోషిగా తేల్చడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాను మళ్లీ టీమిండియాలోకి వస్తాననే నమ్మకముందని చెబుతున్నాడు. తాను తన కూతురుకు ఉగ్రవాదిలా కాకుండా ఓ క్రికెటర్లా కనిపించాలని అన్నాడు.

'మా అమ్మాయి వయసు ఇప్పుడు 3 నెలలు. ఆమె పెరిగి నా గురించి ఇంటర్నెట్‌లో చూస్తే.. నేను ఓ ఉగ్రవాదిలా కాకుండా క్రికెటర్‌లా కనిపించాలనుకుంటున్నా. ఫిక్సింగ్‌ కేసు విచారణ సందర్భంగా దావూద్‌ ఫొటో పక్కన నా ఫొటో చూపించడం దిగ్భ్రాంతికి గురి చేసింది. నేనేం చేశానని ఇలా చేస్తున్నారని ఆవేదన చెందాను' అని శ్రీశాంత తెలిపాడు.

‘నన్ను జైలుకు పంపారన్న వార్త జీర్ణించుకోలేక మా నాన్నకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. నిషేధం తొలగించకపోయినా బోర్డుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాలన్న ఆలోచనేదీ లేదు. నా నిజాయతీని బోర్డు గుర్తిస్తుందనే ఆశిస్తున్నా. కనీసం క్లబ్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇచ్చినా సంతోషిస్తా'నని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

Want my daughter to know me as a cricketer not terrorist: Sreesanth

కాగా, ‘ఇది శ్రీశాంత్‌ సహా మిగతా క్రికెటర్లకు సంతోషకర వార్త. వారిపై జీవితకాల నిషేధం తొలగించడానికి బిసిసిఐకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందనుకోవట్లేదు. ఏదేమైనా అది బోర్డు నిర్ణయం'- టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ పేర్కొన్నాడు.

'క్రికెట్‌కు దూరంగా ఉన్నా శ్రీశాంత్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు సమాచారముంది. బీసీసీఐ అతడిపై నిషేధం తొలగిస్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం' అని కేరళ రంజీ జట్టు కోచ్‌ బాలచంద్రన్ వెల్లడించారు.

కాగా, స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌, చవాన్‌, చండిలా నిర్దోషులని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుతో తమకేమీ సంబంధం లేదన్నట్లు బీసీసీఐ వ్యాఖ్యానించింది. 2013 శ్రీశాంత్‌, చవాన్‌, చండిలాలపై వచ్చిన స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై అంతర్గత విచారణ చేపట్టిన బీసీసీఐ ఆ ఏడాది సెప్టెంబర్లో శ్రీశాంత్‌, చవాన్‌లపై జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Want my daughter to know me as a cricketer not terrorist: Sreesanth

చండిలాపై విచారణ పూర్తికాకపోవడంతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఢిల్లీ కోర్టు తీర్పు తర్వాత కూడా తమ నిర్ణయాల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పడం ద్వారా.. శ్రీశాంత్‌, చవాన్‌లపై నిషేధం కొనసాగుతుందని చెప్పకనే చెప్పింది బోర్డు.

'దేవుడిపై, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాను. తిరిగి క్రికెట్‌ ఆడేందుకు బిసిసిఐ కూడా అనుమతిస్తుందనే నమ్ముతున్నా' అని స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న మరో క్రికెటర్ చండిలా పేర్కొన్నాడు. 'క్రికెటర్‌గా గడ్డుకాలాన్ని అధిగమించాను. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నా' అని అంకీత్‌ చవాన్‌ తెలిపాడు.

Story first published:  Sunday, July 26, 2015, 13:38 [IST]
English summary
"I want my daughter to know me as a cricketer and not a terrorist when she googles my name," said S Sreesanth after being exonerated of spot-fixing charges by a Delhi Court today.
మీ వ్యాఖ్య రాయండి