Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన: ఫలించిన 22 ఏళ్ల నిరీక్షణ

Posted by:
Updated: Tuesday, September 1, 2015, 17:13 [IST]

కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన చివరి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 386 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 263 పరుగులకే ఆలౌటైంది. దీంతో 117 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది.

మూడు టెస్టుల సిరిస్‌‌ను 2-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. దీంతో 22 ఏళ్ల తర్వాత శ్రీలంకలో టెస్టు సిరిస్‌ను గెలుచుకున్న భారత్ జట్టుగా విరాట్ కోహ్లీ సేన రికార్డు సృష్టించింది. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు, ఇషాంత్ శర్మ 3, ఉమేష్ యాదవ్ 2, మిశ్రా ఒక వికెట్ తీసుకున్నారు.

 India vs Sri Lanka 3rd Test, Day 5 Highlights

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో శ్రీలంకలో టెస్టు సిరిస్ గెలిచి టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. మొహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో 1993లో టీమిండియా లంకపై 1-0తో విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగు సార్లు టీమిండియా ప్రయత్నించినా శ్రీలంకపై విజయం సాధించలేదు.

శ్రీలంకలో టీమిండియా రికార్డు (టెస్టుల్లో):

1985 - Lost 0-1 (3-match series) - (కపిల్ దేవ్ - కపిల్ దేవ్)
1993 - Won 1-0 (3) (మొహమ్మద్ అజారుద్దీన్)
1997 - Drawn 0-0 (2) (సచిన్ టెండూల్కర్)
1999 (Asian Test Championship) - Drawn (1) (మొహమ్మద్ అజారుద్దీన్)
2001 - Lost 1-2 (3) (సౌరభ్ గంగూలీ)
2008 - Lost 1-2 (3) (అనిల్ కుంబ్లే)
2010 - Drawn 1-1 (3) (మహేంద్ర సింగ్ ధోని)
2015 - Won 2-1 (3) (విరాట్ కోహ్లీ)

కెప్టెన్‌గా తొలి టెస్టు సిరిస్‌ను గెలిపించిన కోహ్లీ

కొలంబోలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓపెనర్ చటేశ్వర్ పుజారాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. రెండవ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులు చేయడం, తొలి ఓవర్ నుంచి ఆఖరి ఓవర్ వరకూ నిలబడటం పుజారాకు ఈ అవార్డుని తెచ్చిపెట్టాయి.

బౌలర్లలో 8 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ (తొలి ఇన్నింగ్స్ లో 5, రెండవ ఇన్నింగ్స్ లో 3)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించవచ్చని భావించినప్పటికీ, అంపైర్లు పుజారా వైపే మొగ్గు చూపారు. ఈ సిరీస్ లో 20 వికెట్లు తీసిన రవిచంద్రన్ ఆశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

 India vs Sri Lanka 3rd Test, Day 5 Highlights

మ్యాచ్ రిపోర్ట్:

మూడో టెస్టు చివరి రోజు ఆటలో శ్రీలంక ఆరో వికెట్‌ను కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 77వ ఓవర్ మొదటి బంతికి 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 80 ఓవర్లకు శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. శ్రీలంక విజయ లక్ష్యానికి ఇంకా 137 పరుగులు చేయాల్సి ఉంది. చివరి రోజు ఆటలో ఇంకా 40 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

దీంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. మూడో టెస్టు మ్యాచ్‌లో లంక కెప్టెన్ మాథ్యూస్ శతకం సాధించాడు. 217 బంతులు ఎదుర్కొన్న మాథ్యూస్‌ 12 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. మాథ్యూస్‌కు టెస్టుల్లో ఇది 7వ సెంచరీ. రెండో ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లు ఆడిన శ్రీలంక ఐదు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది.

67 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం ఆట ప్రారంభించిన శ్రీలంక లంచ్ విరామానికి మరో రెండు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఇషాంత్ యాదవ్, ఉమేష్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా అశ్విన్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లంక గెలవాలంటే ఇంకా 203 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. 22 సంవత్సరాల నిరీక్షణ ఫలిస్తుందా? పరిస్థితులు చూస్తే అలానే ఉంది.

అయితే వరుణుడి రూపంలో దురదృష్టం వెన్నాడితే... ఏమో చెప్పలేం. విజయం సాధించి గంగూలీ, ధోనీ సాధించలేకపోయిన విజయాన్ని సాధించి చూపించాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఐదో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే శ్రీలంక నాల్గవ వికెట్ కోల్పోయింది. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జేకే సిల్వ, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. నాల్గవరోజు శ్రీలంక బ్యాటింగ్ తడబాటుకు గురైంది.

ఓపెనర్‌గా వచ్చిన తరంగ.. ఇషాంత్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కరుణరత్నే 0, చండీమాల్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. 18.1 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన లంక 67 పరుగులు చేసింది. అంతక ముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఉండటంతో శ్రీలంక టార్గెట్ 385 పరుగులు అయింది. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్ 3, ప్రసాద్ 3, హెరాత్ ఒక వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 312 పరుగులు చేయగా, శ్రీలంక 201 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published:  Tuesday, September 1, 2015, 10:44 [IST]
English summary
Ishant Sharma stole the show today with a magnificent exhibition of bowling. Earlier, fifties from Rohit Sharma and R Ashwin set Sri Lanka a record target.
మీ వ్యాఖ్య రాయండి