Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మ్యాచ్ రద్దు గంగూలీకి తొలి షాక్:ప్రపంచకప్‌పై ప్రభావం

Posted by:
Published: Friday, October 9, 2015, 11:34 [IST]

కోల్‌కతా: గురువారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగాల్సిన భారత్ ‌- దక్షిణాఫ్రికా మూడో టీ20 వర్షం వల్ల రద్దయింది. ఐతే కోల్‌కతాలో ఎప్పుడో మధ్యాహ్నం వర్షం పడితే రాత్రి తొమ్మిది గంటలకూ మైదానాన్ని సిద్ధం చేయలేకపోవడం ఈడెన్‌ గార్డెన్స్‌ నిర్వహణ వైఫల్యమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

భారత్‌తో మూడో టీ20 రద్దవడంతో సిరీస్‌ను 2-0తో దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. తొలి రెండు టీ20ల్లో ఆ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. గురువారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగాల్సిన మూడో టీ20 ఒక్క బంతీ పడకుండానే రద్దయింది.

మ్యాచ్‌ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించాక బహుమతి ప్రదానోత్సవంలో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ సిరీస్‌ ట్రోఫీని అందుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభం కావాల్సిన సమయానికి వర్షం లేదు. అంతకుముందు ఐదారు గంటలు కూడా వరుణుడు రాలేదు.

Kolkata pours cold water on Ganguly's 'debut'; shadow on Eden facilities

మధ్యాహ్నం ఒకటి రెండు గంటల మధ్య వర్షం పడింది. మైదానంలో నీళ్లు నిలిచాయి. ఐతే ఈ నీటిని బయటికి పంపి మైదానాన్ని ఆరబెట్టడంలో బంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధికారులు, సిబ్బంది విఫలమయ్యారు. మైదానాన్ని ఆరబెట్టేందుకు మూడు సూపర్‌ సాపర్లు నిరంతరాయంగా పని చేసినా ఇసుక చల్లి తడిని తగ్గించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

రాత్రి 7.30 గంటలకు తొలిసారి, ఆ తర్వాత 8.30కి మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరగా 9.30కి మరోసారి పరిస్థితిని సమీక్షించి మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని తేల్చారు. అప్పటిదాకా ఓవర్లు కుదించి అయినా మ్యాచ్‌ నిర్వహిస్తారని ఆశించిన అభిమానులు తీవ్ర అసంతృప్తితో మైదానం వీడారు.

ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌ - దక్షిణాఫ్రికా మూడో టీ20 రద్దవడానికి దారితీసిన పరిస్థితులు బీసీసీఐకి తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు. వచ్చే మార్చిలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వబోయేది ఈడెన్‌ గార్డెన్సే.

గురువారం మధ్యాహ్నం వర్షం పడ్డా రాత్రికి కూడా మైదానం సిద్ధం కాక మ్యాచ్‌ రద్దయిన నేపథ్యంలో ఒకవేళ ప్రపంచ కప్‌ ఫైనల్‌ రోజు వర్షం పడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మ్యాచ్‌ రద్దవడంపై స్పందిస్తూ స్టేడియానికి వంద మీటర్ల దూరంలో హూగ్లీ నది ప్రవహిస్తోందని అందువల్లే మైదానంలో తడిని ఆరబెట్టడం సాధ్యం కాలేదని క్యాబ్‌ అధికారులు ప్రకటించారు.

ఐతే ఈడెన్‌ గార్డెన్స్‌లో డ్రైనేజీ వ్యవస్థ పేలవమని ఎప్పట్నుంచో చెబుతున్నప్పటికీ క్యాబ్‌ అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. క్యాబ్‌, స్టేడియం నిర్వాహకుల ఉదాసీనత వల్లే మ్యాచ్‌ రద్దయిందంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు ధ్వజమెత్తారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఇటీవలె ఎన్నికైన గంగూలీకి ఇది మైనస్ అంటున్నారు.

వర్షం వస్తుందని తెలిసినా ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని కప్పి ఉంచలేదని బంగాల్‌ క్రికెట్‌ సంఘం కోశాధికారి బిశ్వరూప్‌ మండిపడ్డాడు. వర్షం పడుతుందని ముందే తెలుసునని, అయినా క్యురేటర్‌ ప్రబీర్‌ ముఖర్జీ మైదానాన్ని కప్పి ఉంచలేదన్నాడు

అందరూ క్యురేటర్‌ను తిట్టిపోస్తుంటే టీమ్‌ఇండియా డైరెక్టర్‌ రవిశాస్త్రి మాత్రం ప్రశంసించాడు. అసలే వర్షాకాలం.. సిబ్బంది చాలా కష్టపడ్డారని, క్యురేటర్‌ ప్రబీర్‌ దాను అభినందించాలన్నాడు. మేం ఆడలేదుగానీ.. పిచ్‌ బాగానే ఉందని రవిశాస్రి అన్నాడు.

English summary
Kolkata pours cold water on Ganguly's 'debut'; shadow on Eden facilities.
మీ వ్యాఖ్య రాయండి