Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తొలిసారి: పురుషుల క్రికెట్ జట్టులో సారా టేలర్

Published: Saturday, October 17, 2015, 15:06 [IST]

అడెలైడ్: ఇంగ్లాండ్ మహిళా వికెట్‌కీపర్ సారా టేలర్ అరుదైన రికార్డును నెలకొల్పనుంది. పురుషుల ‘ఎ' గ్రేడ్ క్రికెట్ మ్యాచ్‌లో ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కనుంది. సౌత్ ఆస్ట్రేలియా ఎలైట్ మెన్స్ క్రికెట్ పోటీల్లో ఆమె పోర్ట్ అడెలైడ్‌తో నార్తన్ డిస్ట్రిక్ట్స్ క్లబ్ తరఫున శనివారం ఆరంభం కానున్న రెండు రోజుల మ్యాచ్‌లో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

పురుషుల విభాగంలో ఏ రెండు రోజుల మ్యాచ్‌లోనూ మహిళలు ఇప్పటి వరకూ ఆడలేదు. సౌత్ ఆస్ట్రేలియా ఎలైట్ మెన్స్ ఛాంపియన్‌షిప్ 1987లో మొదలుకాగా, ఇంత వరకూ మహిళలు అందులో ఆడే సాహసం చేయలేదు. ఆస్ట్రేలియాకు చెందిన మహిళా ఫాస్ట్ బౌలర్ కాథరిన్ ఫిజ్‌పాట్రిక్ 2006-07 సీజన్‌లో విక్టోరియాలో డాండెనంగ్ తరఫున టి-20 మ్యాచ్ ఆడింది.

England Women's Star Sarah Taylor to Make History in Australia Men's Game

అయితే, రెండు రోజుల మ్యాచ్‌లో ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా టేలర్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కొంత ఒత్తిడి కూడా లేకపోలేదని టేలర్ చెప్పింది. క్రికెట్‌లో తన సామర్థ్యాన్ని బేరీజు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా అవార్డును స్వీకరించిన టేలర్ చెప్పింది.

ఎవరైనా తనను హేళన చేయడానికి లేదా మాటలతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే తాను మరింత సంతోషిస్తానని చెప్పింది. ‘ప్రత్యర్థులు స్లెడ్జింగ్‌కు పాల్పడితే వారంతా నన్ను మిగతా ఆటగాళ్లతో సమానంగా చూస్తున్నారని స్పష్టమవుతుంది. అంతకంటే ఏం కావాలి?' అని వ్యాఖ్యానించింది.

ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావనే తాను అనుకుంటున్నానని చెప్పింది. మొత్తం మీద పురుషుల క్రికెట్‌లోకి అడుగుపెట్టడమేగాక సవాళ్లు కూడా విసురుతున్న టేలర్ వికెట్‌కీపర్‌గా, బ్యాట్స్‌విమన్‌గా ఏ స్థాయలో రాణిస్తుందన్న దానిపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

English summary
England international Sarah Taylor will make history this weekend when she becomes the first woman to play men's grade cricket in Australia.
మీ వ్యాఖ్య రాయండి