Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐపీఎల్: కొత్త స్పాన్సర్, మరో 2 కొత్త జట్లు

Posted by:
Updated: Sunday, October 18, 2015, 16:36 [IST]

ముంబై: వచ్చే ఏడాది 2016లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్‌లో 8 జట్లు బరిలోకి దిగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న చెన్నైసూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను టోర్నమెంట్ నుంచి రెండేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

2016లో జరిగే ఐపీఎల్‌కు మరో జట్లను జత చేస్తూ టెండర్లను పిలవాలని అక్టోబర్ 18 (ఆదివారం) జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, అవకతవకలకు పాల్పడినందుకు గాను చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ఆర్ఎమ్ లోథా కమిటీ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి 2018లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్ధాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఆడే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీని అర్ధం 2018 నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు ఉండబోతున్నాయి.

IPL 2016: 2 new teams to play; CSK, RR to return in 2018 after ban

కాగా, ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా పెప్సికో స్థానంలో చైనా మొబైల్‌ తయారీ సంస్థ వివో రానుంది. ఈ మధ్య కాలంలో ఐపీఎల్‌లో తలెత్తిన పలు వివాదాల నేపథ్యంలో పెప్సికో టైటిల్‌ స్పాన్సర్‌గా తప్పుకొంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివో మొబైల్ సంస్ధ రంగంలోకి దిగింది.

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా పెప్సికో 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 396 కోట్ల భారీ మొత్తానికి కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 5 సంవత్సరాలు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఇటీవల ఐపీఎల్‌లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో పెప్సికో ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

తాజాగా స్పాట్ ఫిక్సింగ్ పై జస్టిస్ లోథా కమిటి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లు నిషేధం విధించడంతో పెప్సీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెప్సికో కన్నా ముందుగా ఐపీఎల్‌కు డీఎల్ఎఫ్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. 200 కోట్లకు కుదిరిన డీఎల్ఎఫ్ ఒప్పందం 2008 నుంచి 2012 వరకు కొనసాగింది.

Story first published:  Sunday, October 18, 2015, 16:27 [IST]
English summary
The 9th edition of the Indian Premier League (IPL 9) next year (2016) will feature 8 teams with 2 new sides replacing Chennai Super Kings (CSK) and Rajasthan Royals.
మీ వ్యాఖ్య రాయండి