Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఘోర పరాజయం: వాంఖడేలో రికార్డులు

Published: Monday, October 26, 2015, 11:42 [IST]

ముంబై: భారత్‌తో జరిగిన ఐదు వన్డేలో సిరీస్‌ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు పలు రికార్డులను నమోదు చేసింది. వన్డే చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ శతకాలు నమోదు చేయడం ఇది రెండోసారి. భారత్‌తో ఆదివారం జరిగిన ఐదవ, చివరి వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఫఫ్ డు ప్లెసిస్, క్వింటన్ డికాక్, ఎబి డివిలియర్స్ శతకాలతో హోరెత్తించారు.

ఒక వన్డే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేసిన సంఘటన ఈ ఏడాది జనవరి 18న జొహానె్నస్‌బర్గ్‌లో నమోదైంది. వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ షహీం ఆమ్లా (153 నాటౌట్), రిలీ రూసో (128), ఎబి డివిలియర్స్ (149) సెంచరీలు చేశారు. ఫలితంగా 50 ఓవర్లలో 2 వికెట్లకు 439 పరుగుల భారీ స్కోరును సాధించిన దక్షిణాఫ్రికా, అనంతరం విండీస్‌ను 7 వికెట్లకు 291 పరుగుల వద్ద కట్టడి చేసి 148 పరుగుల తేడాతో గెలిచింది.

సగటున ఓవర్‌కు 8.76 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 38 ఫోర్లు, 20 సిక్సర్లు నమోదయ్యాయి. భారత బ్యాట్స్‌మెన్ 25 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టారు. కాగా, ఒక మ్యాచ్‌ని ఎలా ఆడాలో దక్షిణాఫ్రికా చేతల్లో చూపిస్తే.. ఎలా ఆడకూడదో భారత్‌ను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. పసలేని బౌలింగ్‌కు చెత్త ఫీల్డింగ్ కూడా జత కలిసింది.

ఆ రికార్డూ సఫారీలదే

అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు దక్షిణాఫ్రికా సొంతం. 2006 మార్చి 12న జొహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియాపై ఆ జట్టు మరో బంతి మిగిలి ఉండగా, తొమ్మిది వికెట్లకు 438 పరుగులు సాధించి గెలిచింది. 2009 డిసెంబర్ 15న రాజ్‌కోట్‌లో శ్రీలంక 8 వికెట్లకు 411 పరుగులు చేసినప్పటికీ భారత్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది.

అయితే, లక్ష్య సాధనకు బరిలోకి దిగిన జట్టు చేసిన అత్యధిక స్కోర్ల జాబితాలో ఇది రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది జూన్ 12న ది ఓవల్ మైదానంలో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ 9 వికెట్లకు 365 పరుగులు చేసి, మూడో స్థానంలో ఉంది. అయితే, ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.

కాగా, భారత్ 2013 అక్టోబర్ 16న జైపూర్‌లో ఆస్ట్రేలియాపై 43.3 ఓవర్లలో ఒక వికెట్‌ను కోల్పోయి 362 పరుగులు, అదే ఏడాది అక్టోబర్ 30న నాగపూర్‌లో ఆసీస్‌పైనే 49.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 351 పరుగులు చేసి, విజయాలను సాధించింది.

India suffers humiliating defeat in 5th ODI: Records tumbled at Wankhede Stadium

వైఫల్యాల మధ్య రికార్డు

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా వైఫల్యాల మధ్యే ఒక రికార్డును నెలకొల్పాడు. కనీసం నాలుగు ఇన్నింగ్స్ ఆడిన వన్డే సిరీస్‌ల్లో అతను ఇప్పటి మాదిరి గతంలో ఎన్నడూ విఫలం కాలేదు. టీమిండియాతో ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన అతను మొత్తం 89 పరుగులు చేశాడు. ఒక సిరీస్‌లో అతను దారుణంగా విఫలం కావడం ఇదే మొదటిసారి.

అయితే, ఈ సిరీస్‌లోనే అతను అరుదైన రికార్డును నెలకొల్పాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగంగా 6,000 పరుగులు మైలురాయిని చేరిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు చేశాడు. కోహ్లీ 136 ఇన్నింగ్స్‌లో ఆరు వేల పరుగులను పూర్తి చేస్తే, ఆమ్లా తన 123 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ను సాధించాడు.

భారత చెత్త రికార్డులు: దక్షిణాఫ్రికా అద్భుతం

గణాంకాల్లో చూస్తే సురేష్ రైనా సగటున ఓవర్‌కు 6.33 చొప్పున పరుగులిచ్చాడు. అయితే, అతను కేవలం మూడు ఓవర్లు బౌల్ చేశాడు. రెండు ఓవర్లు వేసిన విరాట్ కోహ్లీ, పది ఓవర్ల పూర్తి కోటాను పూర్తి చేసిన హర్భజన్ సింగ్ సగటున ఏడేసి పరుగులు ఇచ్చారు. అమిత్ మిశ్రా 10 ఓవర్లలో 78 పరుగులిచ్చాడు. ఓవర్‌కు అతను 7.80 పరుగులు సమర్పించుకున్నాడు.

సగటుల్లో అక్షర్ పటేల్ 8.12, భువనేశ్వర్ కుమార్ 10.60 చొప్పున పరుగులిచ్చారు. వన్డేల్లో తన దారుణమైన బౌలింగ్ విశ్లేషణ భువీని దిగ్బ్రాంతికి గురి చేసి ఉండొచ్చు. కాగా, ధోనీకి అత్యంత విశ్వాసపాత్రుడైన మోహిత్ శర్మ 7 ఓవర్లలో 84 పరుగులు (సగటున ఓవర్‌కు 12 పరుగులు) ఇచ్చి కాస్ట్‌లీ బౌలరయ్యాడు.

214 పరుగుల భారీ తేడాతో స్వదేశంలో ఓటమి పాలవడం భారత్ కిదే తొలిసారి. ప్రపంచ చరిత్రలో ఇది రెండో చెత్త ఓటమి. కాగా, సచిన్ తర్వాత అత్యధికంగా 100 క్యాచులు పట్టిన భారత ఆటగాడిగా సురేష్ రైనా రికార్డులకెక్కాడు.

కాగా, సెంచరీ హీరో డు ప్లెసిస్ తాను ఎదుర్కొన్న చివరి 10 బంతుల్లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 33 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా 25 ఓవర్లు ముగిసే సమయానికి 176 పరుగులు చేసింది. 2002 తర్వాత వన్డేల్లో భారత్‌పై ఆ జట్టుకు అదే అత్యుత్తమ స్కోరు.

వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికా అత్యధిక స్కోరును నమోదు చేసిన జట్టుగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. 4 వికెట్లకు 438 పరుగులు వాంఖడేలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు. అంతకు ముందు, 2011 మార్చి 13న కెనడాపై న్యూజిలాండ్ ఆరు వికెట్లకు 358 పరుగులు చేసింది. ఇది ఇలా ఉండగా, 2015లో ధోనీ నేతృత్వంలోని ధోనీ ఒక్క సిరీస్ కూడా గెలవకపోవడం గమనార్హం.

400 ప్లస్ పరుగులు

ఒక వన్డే ఇన్నింగ్స్‌లో 400లకు పైగా పరుగులు నమోదుకావడం ఇది 17వ సారి. అత్యధిక స్కోర్లు చేసిన జట్ల జాబితాలో మొదటి స్థానాన్ని శ్రీలంక ఆక్రమిస్తే, రెండు నుంచి నాలుగు వరకు స్థానాల్లో దక్షిణాఫ్రికా నిలిచింది.

English summary
Several records were broken as well as made as South Africa played the 5th and final One Day International (ODI) game against India at Wankhede Stadium in Mumbai.
మీ వ్యాఖ్య రాయండి