Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టెస్ట్: రూట్ నెం.1, టాప్10లోనూ మనోళ్లు లేరు

Published: Tuesday, October 27, 2015, 16:19 [IST]

దుబాయ్: అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ మళ్లీ అగ్రస్థానాన్ని సాధించాడు. ఈ ఏడాది ఆగస్టులో ఆస్ట్రేలియాతో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం నంబర్ వన ర్యాంకును కోల్పోయిన రూట్.. రెండు నెలల్లోనే ఆ ర్యాంకును చేజిక్కించుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జో రూట్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో రూట్ (88 పరుగులు, 71 పరుగులు) రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో జో రూట్ 913 పాయింట్లతో అగ్ర స్థానానికి ఎగబాకగా, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 910 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబి డివిలియర్స్, హషీం ఆమ్లాలు 3,4వ స్థానాల్లో నిలిచారు.

ICC Test Rankings: Root back as No. 1 batsman, no Indian in top-10

ఐదో స్థానంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్ ఉన్నాడు. ఇదిలా ఉండగా, భారత బ్యాట్స్‌మెన్ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. విరాట్ కోహ్లీ 11వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

టెస్టు బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ 905 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా 827 పాయింట్లతో తొలిసారి రెండో స్థానాన్ని సాధించాడు.

భారత టెస్టు క్రికెట్ విషయానికొస్తే స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఒక్కడే టాప్ 10లో నిలిచాడు. అశ్విన్ 760 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అలాగే ఆల్ రౌండర్ విభాగంలో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు.

కాగా, టెస్టు జట్లలో దక్షిణాఫ్రికా 125 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (106 పాయింట్లు) రెండో స్థానంలో, ఇంగ్లాండ్( 102 పాయింట్లు)మూడో స్థానంలో, 101 పాయింట్లతో పాకిస్థాన్ నాల్గో స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ కంటే ఒక పాయింట్ తక్కువగా ఉన్న టీమిండియా(100 పాయింట్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

English summary
England's Joe Root has become the number 1 Test batsman again, replacing Steve Smith of Australia in the latest ICC Players Rankings released today.
మీ వ్యాఖ్య రాయండి