Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అక్తర్‌ స్పీడ్‌ను బ్రేక్ చేస్తా: భారత కార్మికుడి కొడుకు

Published: Monday, November 2, 2015, 13:31 [IST]

బెంగళూరు: పేస్ బౌలింగ్‌తో అతడు ఇప్పటికే పలువురు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లను ఆకర్షించాడు. అతని బౌలింగ్‌ను బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ప్రశంసించాడు. దక్షిణాఫ్రికాతో ముంబైలోని బ్రేబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచులో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడే ప్రస్తుత భారత దేశీయ క్రికెట్లో వెలిగిపోతున్న 20ఏళ్ల కుడిచేతివాటం ఫాస్ట్ బౌలర్ నాథూ సింగ్.

జైపూర్‌లోని వైర్ ఫ్యాక్టరీలో పని చేసే ఓ సాధారణ కార్మికుడి కుమారుడే ఈ నాథూ సింగ్. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచు కోసం బోర్డ్ ప్రెసిడెంట్స్ 11 టీంకు సింగ్ ఎంపికయ్యాడు. రెండు రోజు జరిగిన ఈ మ్యాచులో అతడు అంతర్జాతీయ బ్యాట్స్‌మన్‌కు తొలిసారి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచులో ఒకే వికెట్(డీన్ ఎల్గర్) తీసినా.. పేస్ ప్రతిభను చాటుకున్నాడు.

‘ఇది నాకు నా కుటుంబానికి పెద్ద రోజు' అని దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఆడిన సందర్భంగా బిసిసిఐ వెబ్‌సైట్‌కు నాథూసింగ్ తెలిపాడు. నాథూ సింగ్ ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ ఆటపై మక్కువతో ఈ స్థాయికి చేరుకున్నాడు. అతను యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

 Inspiring story: Labourer's son Nathu Singh dreams of breaking Shoaib Akhtar's speed record

గల్లీ క్రికెట్ ఆడుతూ.. భారత క్రికెట్‌కు ఆడాలని సింగ్ ఆకాంక్షించే వాడు. అయితే అతని తండ్రి భరత్ సింగ్ కష్టార్జీతమంతా నాథూ కోసమే ఖర్చు పెట్టి రంజీ ఆటగాడిగా నిలబెట్టాడు. జైపూర్‌లో ఓ అకాడమీలో శిక్షణ పొందేందుకు రూ. 10వేలు చెల్లించాల్సి ఉంది. అయితే చెన్నైలోని ఎమ్మార్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌‌లో ఉన్న సమయంలో పేస్ దిగ్గజం గ్లేన్ మెక్‌గ్రాత్ కూడా నాథూ బౌలింగ్ చూసి మెచ్చుకున్నాడు.

‘భరత్ సింగ్ తన జీవితాన్ని కొడుకు కోసమే ధారపోశాడు. అతనికి కష్టార్జీతమంతా కొడుకు క్రికెట్‌లో రాణించేందుకు వెచ్చించాడు. దీంతో నాథూ జైపూర్‌లోని సురణ అకాడమీలో చేరాడు. మూడు సంవత్సరాల వ్యవధిలోనే అతడు హషీం ఆమ్లా, ఏబి డివిలియర్స్‌కు బౌలింగ్ వేసే స్థాయికి చేరుకున్నాడు.' అని బిసిసిఐ.టీవీ పేర్కొంది.

ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరిగిన మ్యాచులో రాజస్థాన్ తరపున తొలిసారి ఆడిన నాథూ సింగ్ 87 పరుగులకు 7 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో గౌతం గంభీర్ కూడా ఉంది. కాగా, తనకు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ అంటే ఇష్టమని, అతని స్పీడ్(గంటకు160కి.మీ.)బ్రేక్ చేయడమే తన లక్ష్యమని నాథూ సింగ్ చెప్పాడు.

‘ఇది నాకు ఎంతో సంతోషం కలిగించే అంశం. కొన్నిసార్లు అవి భయపెడుతున్నాయి కూడా. నాపై చాలా మంది అనేక ఆశలు పెట్టుకుంటున్నారు. వారి ఆశలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తా' అని అతనికి అందుతున్న ప్రశంసలపై నాథూ సింగ్ చెప్పాడు.

భవిష్యత్‌ను ఆలోచించకుండా ప్రస్తుతంపై దృష్టి సారిస్తానని తెలిపాడు. తదుపరి మ్యాచులో మరింతగా రాణించేందుకు కృషి చేస్తానని చెప్పాడు. కాగా, ఫాస్ట్ క్లాస్ క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నా నాథూ సింగ్.. త్వరలోనే జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంటాడని ఆశిద్దాం.

English summary
He has impressed several former and present cricketers with his pace. Rahul Dravid too has praised this lad. And recently he had his 'big day' bowling to South African batsmen at Mumbai's Brabourne Stadium.
మీ వ్యాఖ్య రాయండి