Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వరల్డ్‌కప్‌లో మరిన్ని జట్లు: భారత్-పాక్ సిరీస్‌పై సచిన్

Published: Wednesday, November 4, 2015, 13:03 [IST]

న్యూయార్క్: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ ఇరుదేశాల ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఈ వివాదాల పరిష్కారం కోసం ఇరుదేశాల ప్రభుత్వాలు సమావేశమవ్వాలని సూచించాడు.

‘భారత్-పాక్ సిరీస్ పునరుద్ధరణ జరగడం అత్యవసరం. రెండుదేశాలు కలిసి క్రికెట్ ఆడకూడదనడానికి నాకైతే కారణాలు కనపడడం లేదు' సచిన్ అని పేర్కొన్నాడు. రెండు క్రికెట్ బోర్డుల అధికారుల సమావేశమై చర్చలు జరిపినంత మాత్రాన ప్రయోజనం ఉండదని స్పష్టం చేశాడు. ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి కాబట్టి, అక్కడి నుంచి సానుకూల స్పందన ఉండాలని చెప్పాడు.

Sachin Feels More Countries Should Play in ICC World Cup to Make Cricket a Global Sport

ప్రపంచ కప్‌లో మరిన్ని జట్లు

క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రపంచ కప్‌లో అత్యధిక జట్లకు అవకాశం కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి సచిన్ తెండూల్కర్ సూచించాడు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌తో కలిసి వెటరన్స్ క్రికెట్ టోర్నమెంట్ ‘క్రికెట్ ఆల్ స్టార్స్ 2015'ను నిర్వహించనున్న సచిన్ చాలా కాలం తర్వాత ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ముత్తయ్య మురళీధరన్, బ్రియాన్ లారా, వసీం అక్రం, షోయబ్ అక్తర్ వంటి 28 మంది మాజీ క్రికెటర్లను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాడు. ఈ సందర్భంగా సచిన్ పిటిఐతో మాట్లాడుతూ.. క్రికెట్‌ను మరింతగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నాడు. ప్రపంచ కప్‌లో అత్యధిక జట్లకు అవకాశం కల్పించాలని సూచించాడు.

1975లో వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి ఈ మెగా ఈవెంట్‌లో 9 నుంచి 12 జట్లు మాత్రమే ఆడాయని అన్నాడు. ఈ సంఖ్య మరింతగా పెరగాలని అన్నాడు. మాజీ క్రికెటర్లు టి-20 ఫార్మెట్‌లో మ్యాచ్‌లు ఆడడాన్ని ఎవరూ హర్షించరని, అందులోనూ అమెరికాలోని న్యూయార్క్, హూస్టన్, లాస్ ఏంజెల్స్‌లో జరిగే మ్యాచ్‌లను ఎవరూ ఆదరించరని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ చేసిన వ్యాఖ్యలపై సచిన్ స్పందిస్తూ.. రిటైరైనంత మాత్రాన జీవితంలో మళ్లీ బ్యాట్ పట్టుకోకూడదన్న నిబంధన ఎక్కడా లేదని అన్నాడు.

అత్యున్నత స్థాయిలో ఆడలేమన్న ఉద్దేశంతోనే ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటిస్తారని చెప్పాడు. క్రికెట్‌ను చూస్తూ లేదా ఇతరత్రా స్థాయి మ్యాచ్‌ల్లో ఆడుతూ ఆనందించ కూడదనుకోవడం తప్పని అన్నాడు. తమతోపాటు ప్రేక్షకులను కూడా ఆనందింప చేయడానికే మాజీ క్రికెటర్లంతా మళ్లీ మైదానంలోకి దిగబోతున్నారని చెప్పాడు.

ప్రతి ఒక్కరికీ తమతమ అభిప్రాయాలు ఉంటాయని, అయితే, అన్నీ సరైనవే కావాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించాడు. క్రికెట్ ఆల్ స్టార్స్ టోర్నీ జయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

English summary
Legendary batsman Sachin Tendulkar Tendulkar feels cricket might be the second most popular sport in the world but in order to make it a global sport more countries need to play in the game's showpiece event, the ICC World Cup.
మీ వ్యాఖ్య రాయండి