Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బిసిసిఐ చర్యలు మోసపూరితం: పాక్ డెయిలీ

Published: Wednesday, November 18, 2015, 13:18 [IST]

ఇస్లామాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) చర్యలు మోసపూరితంగా, దురాశతో కూడుకున్నవిగా ఉన్నాయని బుధవారం ఓ పాకిస్థాన్ డెయిలీ తన కథనంలో పేర్కొంది. ఈ విధంగా బిసిసిఐ చేసే అపనమ్మకమైన బ్లాక్ మెయిల్‌ను ఆపేయండని ఆ డెయిలీ అధికారులను కోరింది.

‘మెలీస్ ఫ్రం ది బిసిసిఐ' అనే శీర్షికన పాక్ డెయిలీ ‘ది నేషన్' కథనాన్ని ప్రచురితం చేసింది. ‘యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా పాకిస్థాన్‌తో సిరీస్ ఆడేందుకు భారత్ అంగీకరించలేదు. ఇది రెండు క్రికెట్ బోర్డుల మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే'నని పేర్కొంది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ఆధ్వర్యంలో రూపొందించబడిన అండర్ ది ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం(ఫిటిపి) ప్రకారం మ్యాచులు నిర్వహించబడతాయి. ఆతిథ్య దేశంలోనూ, మరేదైనా దేశంలోనూ పదేళ్ల కాలంలో ఈ మ్యాచులు నిర్వహించబడతాయి.

 BCCI's actions are 'malicious and motivated by greed': Pakistani daily

‘ఎఫ్‌టిపిలో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందాలను ఇండియా అగౌరవపర్చింది. బిసిసిఐ చర్యలు మోసపూరితంగా, దురాశతో కూడినవిగా ఉన్నాయి' అని పాక్ డెయిలీ పేర్కొంది. ఇండియా-పాక్ మ్యాచులు జరగకపోవడానికి భద్రతే ప్రధాన కారణంగా తెలుస్తోందని తెలిపింది.

పాక్-భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచులు నిర్వహించబడటం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిరీస్‌లు జరగడం లేదని, భవిష్యత్‌లో కూడా జరిగే అవకాశం లేకుండా పోతోందని పేర్కొంది.

‘భద్రతా చర్యలు లేదా ద్వైపాక్షిక సంబంధాలు మ్యాచులు జరగకపోవడానికి ప్రధాన కారణం కాకపోవచ్చు. బిసిసిఐ పాకిస్థాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు సుముఖత చూపుతోంది అది కూడా భారత్‌లోనే. భారతదేశంలో సిరీస్ ఆడితే ద్వైపాక్షి సంబంధాలు ఒక సమస్య కాదని తెలుస్తోంది' అని తన కథనంలో వెల్లడించింది.

తటస్థ వేదికైన యూఏఈలో సాధారణంగా క్రికెట్ మ్యాచులు జరుగుతాయి, అక్కడే సిరీస్ ఆడవచ్చు కదా! అని పేర్కొంది. భారతదేశంలో భద్రతా పరమైన సమస్యలున్నాయని కూడా వెల్లడించింది. ముస్లింలు, పాకిస్థానీలపై శివసేన దాడులకు పాల్పడుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌లో మ్యాచులు ఆడేందుకు పాక్‌ను ఆహ్వానించడం సబబేనా? అని ప్రశ్నించింది.

అంతేగాక, ఎలాంటి ప్రమాదం లేదని వేదికల్లోనే మ్యాచులు ఆడేలా చూస్తామని భారత్ హామి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ‘ఇండియాలో ఆడితే బ్రాడ్ కాస్టింగ్ రైట్స్, టికెట్ సేల్స్, ప్రకటనల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం ఇండియాకే వస్తుంది. అదే యూఏఈలో జరిగితే అదంతా పాకిస్థాన్‌కు వస్తుంది'అని తెలిపింది.

‘పిసిబి ఛైర్మన్, పాకిస్థాన్ ప్రభుత్వం ఇండియా బోర్డ్ చేసే మోసపూరిత ప్రతిపాదనను తిరస్కరించాలి. ఈ విషయాన్ని ఐసిసి దృష్టికి తీసుకెళ్లాలి. బిసిసిఐ ఒప్పంద ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలి' అని పాక్ డెయిలీ పేర్కొంది. పాక్‌తో ఆడేందుకు బిసిసిఐ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో పాక్ డెయిలీ ఈ కథనం ప్రచురితం చేసినట్లు తెలుస్తోంది.

English summary
The BCCI's actions are "malicious and motivated by greed", said a Pakistani daily on Wednesday. It asked authorities here to "resist this dishonest blackmail by the Indian board".
మీ వ్యాఖ్య రాయండి