Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆవేశ్ స్పీడ్‌కు బంగ్లా విలవిల: భారత్ గెలుపు

Published: Saturday, November 21, 2015, 16:24 [IST]

కోల్‌కతా: అండర్-19 ట్రైసిరీస్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ కాంప్లెక్స్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పేసర్ ఆవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో విజృంభించి 4 పరుగులకే 4 వికెట్లు కైవసం చేసుకోగా, మరో బౌలర్ జీషన్ అన్సారీ (2/1) కూడా తనవంతు రాణించి భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు.

కెప్టెన్ రికీ భుయి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆరంభంలోనే ఇబ్బందులు పడింది. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్‌గా దిగిన వికెట్ కీపర్ ఇశాన్ కిషన్ (6)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ విరాట్ సింగ్ (0), రికీ భుయి (8), సర్‌ఫ్రాజ్ ఖాన్ (2) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరగా, ఓపెనర్ వాషింగ్టన్ సుందర్ 34 పరుగులు సాధించి మెహెదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో లెగ్‌బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించాడు.

దీంతో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఆ తర్వాత మయాంక్ దాగర్ (6), కనిష్క్ సేథ్ (1) వికెట్లను కూడా చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అన్మోల్‌ప్రీత్ సింగ్, జీషన్ అన్సారీ కొద్దిసేపు స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

Under-19 Tri-series: Avesh Khan bowls India to big win

అయితే, ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించిన తర్వాత అన్మోల్‌ప్రీత్ సింగ్ (28) సంజిత్ షా బౌలింగ్‌లో మొహమ్మద్ సైఫుద్దీన్‌కు దొరికిపోగా, కొద్దిసేపటికి జీషన్ అన్సారీ (34) మెహెదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.

చివర్లో ఆవేశ్ ఖాన్ కొద్దిసేపు దూకుడుగా ఆడి 29 బంతుల్లో ఒక సిక్సర్, మరో రెండు ఫోర్ల సహాయంతో 25 పరుగుల వ్యక్తిగత స్కోరుతో అజేయంగా నిలిచినప్పటికీ టెయిలెండర్ శుభం మావి (1) మొహమ్మద్ సైఫుద్దీన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవడంతో భారత జట్టు 45.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది.

బంగ్లాదేశ్ బౌలర్లలో మెహెదీ హసన్ మిరాజ్ 3 వికెట్లు కైవసం చేసుకోగా, సలెహ్ అహ్మద్ షావోన్, అబ్దుల్ హలీమ్ రెండేసి వికెట్లు, మొహమ్మద్ సైఫుద్దీన్, సంజిత్ షా ఒక్కో వికెట్ అందుకున్నారు.
అనంతరం 159 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టును ఆవేశ్ ఖాన్ ఆరంభంలోనే చావుదెబ్బ తీశాడు.

నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభించి తొలి బంతికే ఓపెనర్ సైఫ్ హసన్ (0)ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చిన ఆవేశ్ ఖాన్ ఆ తర్వాత మరో ఓపెనర్ పినాక్ ఘోష్ (1)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ నజ్ముల్ హుస్సేన్ శాంతో (7), కెప్టెన్ మెహెదీ హసన్ మిరాజ్ (0) వికెట్లను కూడా కైవసం చేసుకున్నాడు. దీంతో 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టు ఆ తర్వాత వికెట్ కీపర్ జకీర్ హసన్ (9), మొహమ్మద్ సైఫుద్దీన్ (1), సరుూద్ సర్కార్ (13) వికెట్లను కూడా స్వల్పస్కోర్లకే చేజార్చుకుని మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

ఈ తరుణంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షఫీయుల్ హయత్ 26 పరుగులు సాధించి వెనుదిరగ్గా, సలేహ్ అహ్మద్ షావోన్ (0), మరో టెయిలెండర్ అబ్దుల్ హలీమ్ (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే నిష్క్రమించారు. దీంతో 22 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్ జట్టు 82 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ చక్కగా రాణించి 4 పరుగులకే 4 వికెట్లు కైవసం చేసుకోగా, కనిష్క్ సేథ్, జీషన్ అన్సారీ రెండేసి వికెట్లు, శుభం మావి, మయాంక్ దాగర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

English summary
Pacer Avesh Khan claimed four wickets to power India to an emphatic 82-run victory over Bangladesh in the Under-19 Triseries one-day cricket tournament opener here Friday.
మీ వ్యాఖ్య రాయండి