Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

త్వరలో పాక్-భారత్ సిరీస్: వేదిక శ్రీలంకే!

Published: Tuesday, November 24, 2015, 15:13 [IST]

అబుదాబి: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ సిరీస్‌కు మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, దుబాయ్, భారత్ కాకుండా.. మధ్యే మార్గంగా ద్వైపాక్షిక సిరీస్‌కు ఆతిథ్యమిచ్చే వేదికగా శ్రీలంక దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు కూడా సిరీస్‌ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉంది. నవంబర్ 27న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

గత ఆదివారం బిసిసిఐ అధ్యక్షుడు, ఐసిసి ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌, పిసిబి ఛైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌, మధ్యవర్తి గైల్స్‌ క్లార్క్‌ మధ్య సమావేశం నేపథ్యంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. యూఏఈలో ఆడేందుకు భారత్‌, భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్‌ తిరస్కరించిన నేపథ్యంలో శ్రీలంక ప్రత్యామ్నాయ వేదికగా అవతరించింది.

శ్రీలంక (తటస్థ వేదిక)లో సిరీస్‌పై రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ గానీ, పీసీబీ గానీ ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. అయితే, దక్షిణాఫ్రికాతో డిసెంబర్‌ 7న సిరీస్‌ ముగిసిన అనంతరం భారత్‌కు ఒక నెల మాత్రమే ఖాళీ ఉంటుంది. దీంతో భారత్‌-పాక్‌ సిరీస్‌ను కుదించనున్నారు. రెండు జట్లు మూడు వన్డేలు, రెండు టీ20ల్లో తలపడే అవకాశముంది.

Sri Lanka likely venue for India-Pakistan series, announcement on Nov 27

వాస్తవ షెడ్యూలు ప్రకారం భారత్‌, పాక్‌లు ఐదు వన్డే మ్యాచ్‌లు, రెండు టీ20ల్లో తలపడాల్సివుంది. సిరీస్‌పై తుది నిర్ణయాన్ని నవంబర్ 27న ప్రకటించే అవకాశముంది. నిజానికి సిరీస్‌పై సోమవారమే గైల్స్‌ క్లార్క్‌ మీడియా సమావేశం నిర్వహించాల్సివుంది. కానీ అది జరగలేదు. మ్యాచ్‌ల తేదీలు, స్టేడియాలు ఇంకా ఖరారు కాలేదని ఓ అధికారి చెప్పాడు.

వాన ముప్పు తప్పించుకునేందుకు డిసెంబరు ద్వితీయార్ధంలో మ్యాచ్‌లు నిర్వహించవచ్చని తెలిపాడు. ఖేతరామ, పల్లెకెలె స్టేడియాలు భారత్‌-పాక్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశముందని క్రికెట్‌ శ్రీలంకకు చెందిన ఓ అధికారి చెప్పాడు. ఇప్పుడు కొలంబో, క్యాండీల్లో రోజూ వర్షాలు కురుస్తున్నాయి.

అయితే, డిసెంబరు ఆఖరుకు వాతావరణం బాగుంటుందని భావిస్తున్నారు. ఖేతరామలో డిసెంబరు 23, 30వ తేదీల్లో జరగాల్సిన దేశవాళీ టీ20 మ్యాచ్‌లను మరో చోటుకు తరలిస్తారు. కాగా, పల్లెకెలె స్టేడియానికి అలాంటి ఇబ్బందులేమీ లేవు.

English summary
Sri Lanka has emerged as the likely venue for the much-awaited Indo-Pak bilateral cricket series and an official announcement may be made on November 27.
మీ వ్యాఖ్య రాయండి